సుకుమార్ మారిపోయాడు…అవును పుష్ప సినిమా చూసిన సగటు ప్రేక్షకునికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాకు రంగులద్దడం..సుకుమార్ నేర్చేసుకున్నాడు. పంథా మార్చుకుని పూర్తిగా కొత్త దారిలో అడుగులు వేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు ఏం నచ్చుతుంది. హిట్టు కొట్టాలంటే ఏం చేయాలో అది మాత్రమే చేస్తున్నాడు. కమర్షియల్ సినిమాలో సెంటిమెంట్‌ను జొప్పించి ప్రేక్షకులను మెప్పించడంలో సుకుమార్ సఫలికృతం అయ్యాడు. లెక్కలతో ఏ మాత్రం ప్రేక్షకున్ని తికమక పెట్టకుండా నిర్మాతను రిస్క్‌లో పెట్టకుండా హీరో తాలూకు ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ…ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడు. సినిమా ప్రారంభం నుంచే ప్రతీ నిమిషం మాస్ పల్స్‌ను పట్టుకుని ఎక్కడ విడవకుండా సినిమా ఆసాంతం చివరి వరకు కొనసాగించాడు.  యాక్షన్ సన్నివేశాలు,సెంటిమెంట్, లవ్, ఇలా ఆడియన్స్ ఎక్కడా నిరుత్సాహానికి గురి చేయకుండా చాలా బ్యాలెన్స్‌డ్‌గా సినిమా తీశారు.

అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా ప్రమోట్ అయ్యేందుకు పుష్ప ది రైజ్ మొదటి మెట్టుగా పనిచేస్తుంది. నటన పరంగా అల్లు అర్జున్ సినిమాతో మరో మెట్టెక్కాడు. మెగా కాంపౌండ్ దాటి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ముందుకెళ్లడానికే పుష్ప కథ ఎంచుకున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. ఎవరో వేసిన బాటలో తాను నడవడం లేదని తనకంటూ ప్రత్యేకమైన బాటలో వెళుతున్నట్టు చెప్పకనే చెప్తున్నాడు. ఎర్రచందనం కూలీ నుంచి మొదలై వ్యాపారుల సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయాడు.

ఇక కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌కు ఎంత స్కోప్ ఉంటుందో అంతే స్పేస్ రష్మిక కల్పించాడు డైరెక్టర్. సునీల్ మార్క్ కామెడీని ఇంత వరకు చూశాం…ఇక ఇప్పటి నుంచి విలనిజం చూస్తారు. రావు రమేష్ మరోసారి తన నటనతో మెప్పించాడు. ఒక సైకో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫవాద్ ఫాజిల్ ఇరగదీశాడు. ఎదురు లేకుండా వెళుతున్న పుష్పరాజ్ కు ఫాజిల్ మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అతన్ని చిత్తు చేసేందుకు బన్నీ వేసే ఎత్తులు మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. స్టోరీలో పాటలు తేలిపోయాయి. చివరిగా వచ్చే ఏ బిడ్డా ఇది నా అడ్డా కాకుండా మిగతా పాటలన్నీ అంతంతమాత్రమే. సమంత చేసిన పాట సినిమాకు ఏ మాత్రం ప్లస్ చేయదు.

మొత్తానికి సినిమా గురించి చెప్పాలంటే…లెక్కలు, బొక్కలు లేని కమర్షియల్ సినిమా పుష్ప దిరైజ్.

రివ్యూ  బై-SKG