తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ పీక్ స్టేజ్ కు చేరినట్టే కనిపిస్తోంది. పైకి అలయ్, బలయ్ అంటున్నా.. ఆ పార్టీలోని అగ్రనేతల మధ్య అస్సలే పొసగడం లేదన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బండి, రఘునందన్, ఈటల ఒకరంటే ఒకరికి పడనట్టుగా వ్యహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకుల్లో ఎవరికీ ఎలాంటి పవర్స్ లేవని, పార్టీ నేతలు ఎవరినీ నమ్మిమోసపోవద్దంటూ తాజాగా బండి సంజయ్ వార్నింగ్ ఇవ్వడం.. పార్టీలో ఉన్న విబేధాలను స్పష్టం చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నిజానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రఘునందన్ అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. చార్మినార్ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సమయంలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బండి తమ నేతను అవమానించారని రఘునందన్ వర్గం ఆ మధ్య పెద్ద గొడవే చేసింది. ఈ విషయంపై రఘునందన్(Raghunandan Rao) సైతం నేరుగా పార్టీ సమావేశంలోనే తన ఆక్రోశాన్ని వెళ్లగక్కినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. ఇక అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, విప్‌ పదవులను భర్తీ చేయకుండా బండి సంజయే(Bandi Sanjay) అడ్డుపడుతున్నారని రఘునందన్ ఆక్షేపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రఘునందర్ టీఆర్ఎస్ లో చేరతారని జరుగుతున్న ప్రచారం వెనుక బండి అండ్ కో ఉన్నారని రఘునందర్ వర్గం భావిస్తోంది. అందుకే బండి పేరెత్తితేనే రఘునందన్ కుతకుతలాడిపోతున్నట్టుగా తెలుస్తోంది.అందుకే రెండో విడత పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి వెళ్లకూడదని అనుకుంటున్నారట రఘునందన్.
అటు ఈటల విషయంలోనూ ఇలాంటి చర్చే నడుస్తోంది. రాష్ట్ర నాయకత్వం అనుమతి లేకుండా ఈటల సొంతంగా జిల్లాల్లో పర్యటించడం పట్ల బండి అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు సమాచారం ఇవ్వకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడంపై గుస్సా అవుతున్నారట బండి. మరోవైపు బండితో పోలిస్తే తానే సీనియర్ అయినప్పటికీ.. ఆయన డైరెక్షన్ లో పనిచేయడంపై ఈటల చాలా ఇబ్బందిపడుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలన్న తన విజ్ణప్తిని కేంద్రం నాయకత్వం తిరస్కరించడం వెనుక బండినే ఉన్నారని ఈటల(Etela Rajendar) భావనగా తెలుస్తోంది. పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా… తెలంగాణ బీజేపీలో చాలా లుకలుకలే ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.