తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల వ్యూహకర్త పీకే ఎక్కడ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడతారోనని అంతా ఆందోళన చెందుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలవాలంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలంటూ పీకే చేసిన సూచన ఎక్కడ తమదాకా వస్తుందో అని వణికిపోతున్నారు. పీకే ఫార్ములా అమలు చేయాల్సి వస్తే.. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే ఇన్నాళ్లు ఆ పార్టీపై చేసిన పోరాటం అంతా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని వాపోతున్నారు.
ఇప్పటికే 2018 ముందస్తు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నిండా మునిగిపోయామని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తరచూ చెబుతుంటారు. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని కూడా గట్టిగా అనుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో నిలవాలని.. 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలనే డిమాండ్లు కూడా చేస్తున్నారు. టీఆర్ఎస్ ను ఓడించేది తామేనన్న ధీమాతో గట్టిఫైటే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ తెరపైకి రావడం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో కలవరం రేపుతోంది.
దేశమంతా ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం పొత్తులకు ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ ముఖ్య నేతలు వాదిస్తున్నారు. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ దగ్గరే తేల్చుకుంటామని చెబుతున్నారు. పీకే ప్లాన్ ఎలా ఉన్నా.. తెలంగాణ విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. రాహుల్ రాష్ట్ర పర్యటనలో ఈ విషయాన్ని సీరియస్ గా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.